అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి తర్వాత.. టీటీడీ ఈవో సూచనలు TTD Chairman On Alipiri Incident: తిరుమల శ్రీవారి అనుగ్రహంతో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి నుంచి బాలుడు కౌశిక్ క్షేమంగా బయట పడ్డాడని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడిని ఆయన పరామర్శించారు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భక్తులు గురువారం రాత్రి అలిపిరి నడక మార్గంలో శ్రీవారి దర్శనార్థం నడిచి వెళ్తుండగా చిరుత 3 సంవత్సరాల కౌశిక్‌ను గాయపరిచి తీసుకువెళ్లిందన్నారు. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు బాలుడి ప్రాణాలు కాపాడారని చెప్పారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని.. మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
ఆ అంశంపై పునరాలోచిస్తాం: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా రెండు వైపులా కంచె ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ నిబంధనలు కంచె ఏర్పాటుకు అడ్డంకిగా మారితే అలిపిరి నడక మార్గంలో భక్తులను రాత్రి వేళలో అనుమతించే అంశంపై పునరాలోచిస్తామన్నారు.
అలిపిరి మెట్ల మార్గంలో మూడు సంవత్సరాల బాలుడు కౌశిక్‌ని చిరుత తీసుకొని వెళ్లిపోయింది అసలు. బాలుడి ప్రాణాలు కాపాడగలిగాం. నిజంగా మనం చేసిన దానికంటే ఆ దేవుడే బాబుకి పునర్జన్మ ఇచ్చాడు. బాబుకి ఎటువంటి ప్రమాదం లేదు. స్పెషల్ దర్శనం చేపించి.. ఇంటికి పంపిస్తాం అని చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునారవృతం కాకుండా ఉండేందుకు.. అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తే.. ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం. - వైవి సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్
బాలుడిపై చిరుత దాడి చేసిన స్థలాన్ని పరిశీలించిన తితిదే ఈవో: అలిపిరి కాలినడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని తితిదే ఈవో ధర్మారెడ్డి మరోసారి పరిశీలించారు. రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీరితో పాటు సెక్యూరిటీ గార్డ్ ఉండేలా, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం కెమెరా ట్రాప్స్ సిద్ధం చేసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు.. అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచన చేయాలని సూచించారు.