TTD drone cameras shot Update: నో ఫ్లై జోన్ అయిన తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని.. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్లుగా భావిస్తున్న దృశ్యాలు వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలు.. ఆగమ శాస్త్ర నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఆలయ భద్రతను ప్రశ్నించేలా ఉండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తి.తి.దే. భద్రతా సిబ్బంది వైఫల్యం అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో డ్రోన్ దృశ్యాలు నిజమైనవో కాదో నిగ్గు తేల్చుతామని తి.తి.దే. ప్రకటించింది.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా కోట్లాది ప్రజల పూజలందుకుంటున్నతిరుమల శ్రీనివాసుడి ఆలయానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. తిరుమల గిరులను సాక్షాత్తు దేవతల క్రీడాద్రి పర్వతాలుగా భావిస్తారు. అంతటి పవిత్రత కలిగిన శ్రీవారి ఆలయ పరిసరాల్లో ఆగమ శాస్త్రాల మేరకు విమానాలు వంటివి ఎగరడం నిషిద్ధం. కానీ శ్రీవారి ఆలయానికి అత్యంత దగ్గరగా విమాన ప్రాకారం అత్యంత స్పష్టంగా కనిపించే డ్రోన్ చిత్రాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం దుమారం రేపుతోంది.
శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలు బయటకు రావడం.. తిరుమల భద్రతపై అనేక సందేహాలకు తావిస్తోంది. తి.తి.దే. భద్రతా సిబ్బందితో పాటు అక్టోపస్ బలగాలు, S.P.F., A.R. సిబ్బంది, పోలీసులు నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. ఆలయ పరిసరాల్లో ప్రతి చిన్న కదిలికలను సైతం పసిగడుతుంటారు. అలాంటిది ఏకంగా డ్రోన్‍తో దృశ్యాలు చిత్రీకరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోని వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి.. నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తి.తి.దే. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.