ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదే 2023-24 ఆర్థిక బడ్జెట్‌.. ఈసారి ఎన్నికోట్లు కేటాయించారంటే..?

Release of TTD 2023-24 financial budget: తిరుమల తిరుపతి దేవస్థానం 2023-24 ఆర్థిక బడ్జెట్‌ అంచనాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేడు ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో బడ్జెట్‌ అంశాలతోపాటు పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. కొవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందన్న ఆయన.. కొవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్‌లైన్ సేవలను యథాతధంగా కొనసాగిస్తామని, వీఐపీ బ్రేక్ దర్శనాల సమయపాలనలో ఎలాంటి మార్పులు చేయకుండా ఆ విధానాన్ని అలాగే కొనసాగిస్తామన్నారు.

Tirumala Tirupati
Tirumala Tirupati

By

Published : Mar 22, 2023, 4:54 PM IST

Release of TTD 2023-24 financial budget: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) 2023-24 ఆర్థిక బడ్జెట్‌ను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. నేడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తితిదే బడ్జెట్ అంచనాలకు సంబంధించిన వివరాలతోపాటు, మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తితిదే వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''గతనెల 17వ తేదీన జరిగిన పాలకమండలి సమావేశంలో 2023-24 ఆర్థిక బడ్జెట్‌‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాము. కానీ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బడ్జెట్ వివరాలను వెల్లడించలేదు. తితిదే 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూ.4,411 కోట్లుగా నిర్ణయించాం. ఈ బడ్డెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. ఇందులో రూ.5.65 కోట్లతో 30 అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేశాం. తమిళనాడులోని శ్రీవారి ఆలయ నిర్మాణ పనులకు రూ.4.70 కోట్లను కేటాయించాం. ఎస్వీ కళాశాలలో మూడో అంతస్తు ఏర్పాటుకు రూ.4.78 కోట్ల నిధులు కేటాయించాం'' అని ఛైర్మన్‌ సుబ్బారెడ్డి అన్నారు.

కొవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది: అనంతరం కరోనా మహమ్మారి తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి ముందు.. శ్రీవారి ఆలయానికి ఏడాదికి రూ.1200 కోట్ల రూపాయల కానుకలు వస్తే.. ఆ తర్వాత సంవత్సరం నుంచి అది రూ. 1500 కోట్ల రూపాయల దాకా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక, బ్యాంకుల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు పెరిగాయని ఛైర్మన్ తెలియజేశారు. తిరుపతిలోని శ్రీనివాససేతు పనులను ఏప్రిల్‌లోపు పూర్తి చేస్తామన్నారు. అలిపిరి నుంచి వకుళామాత ఆలయం వరకు కొత్త రోడ్డు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం సమయాన్ని మార్చడం వల్ల సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని.. ఈ విధానాన్ని కొనసాగిస్తామని వివరించారు. ఏప్రిల్‌ 5న ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణోత్సవంలో సీఎం జగన్‌ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆన్‌లైన్ సేవలను యథాతధంగా కొనసాగిస్తాం:అంతేకాకుండా, కొవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్‌లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా, శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులు.. సౌకర్యార్థం కోసం ఈసారి రూ.5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డూల కౌంటర్లను ఏర్పాటు చేయడానికి పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం, ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు కేటాయించగా.. తిరుపతిలోని యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు కేటాయించామన్నారు.

ఏప్రిల్ 5న వైభవంగా శ్రీరామనవమి: ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాములవారి కల్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారీ చేసేవారు నియంత్రణ పాటించాలని ఆయన అధికారులను విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి.. సమయపాలనలో ఎలాంటి మార్పులు చేయకుండా ఆ విధానాన్ని అలాగే కొనసాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. అతి త్వరలోనే బాలాజీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ అంకాలజీని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరంగా పూర్తి చేస్తున్నారని.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details