Tirumala Brahmotsavam: కలియుగ వైకుంఠం తిరుమలలోని మాడ వీధులు దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భక్తసంద్రమయ్యాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా వెలవెలబోయిన గ్యాలరీలు మళ్లీ కళకళలాడాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్దశేష వాహనంపై విహరించిన గోవిందుడికి భక్తజనం కర్పూర హారతులు పట్టింది. ముఖ్యమంత్రి జగన్.. ఈసారీ ఒక్కరే స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ.. ధ్వజారోహణం నిర్వహించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పిస్తున్న సీఎం జగన్.. ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. సంప్రదాయ పంచెకట్టులో.. బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన.. జగన్ తలకు అర్చకులు పరికట్టం కట్టారు. అక్కడి నుంచి పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని వెళ్లి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి సమర్పించారు.
వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం.. రంగనాయక మండపంలో.. ముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తితిదే 2023 కాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ స్వామివారి.. వాహన సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు వజ్రవైఢూర్యాలతో కూడిన తిరువాభరణాలు ధరించిన మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా పెద్దశేష వాహనంపై విహరించారు.