TIRUMALA BRAHMOTSAVAM 2022 : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య.. ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం.. విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. రాత్రి తొమ్మిది గంటలకు పెద్దశేష వాహన కార్యక్రమంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి.
విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న తిరుమల కొండ : కరోనా నేపథ్యంలో.. రెండేళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన తితిదే.. ఈ ఏడాది వేడుకల్ని భక్తుల మధ్య జరపనుంది. భక్తులు అధికంగా వస్తారనే అంచనాతో ఘనంగా ఏర్పాట్లు చేసింది. శ్రీవారి ఆలయం సహా.. స్వామివారి సన్నిధి, పడికావలి, రంగనాయకుల మండపాన్నివిద్యుత్ దీపాలు, పుష్పాలతో.. అలంకరించారు. తిరుమల కొండ ప్రధాన కూడళ్లు, రహదారులు.. బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నాయి. వేడుకలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం : స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తాడేపల్లి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి.. సీఎం చేరుకుంటారు. గంగమ్మ ఆలయాన్ని సందర్శించి, సారె సమర్పించిన అనంతరం.. అలిపిరిలో ఎలక్ట్రిక్ విద్యుత్ బస్సులు ప్రారంభిస్తారు. ఆ తరువాత తిరుమల వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి..పెదశేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి.. బుధవారం ఉదయం పరకామణి నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం లక్ష్మీ వీపీఆర్ రెస్ట్‌హౌస్‌ను ప్రారంభించి.. అక్కడి నుంచి సీఎం నంద్యాల జిల్లా బయలుదేరి వెళ్లతారు.
పెద్దశేషవాహనం (ఈరోజు రాత్రి 9 గంటలకు): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు అయిన ఈరోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం.
చిన్నశేషవాహనం (28వ తేదీ ఉదయం 8 గంటలకు): రెండో రోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది.
హంస వాహనం (28వ తేదీ రాత్రి 7 గంటలకు): బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.
సింహ వాహనం(29వ తేదీ ఉదయం 8 గంటలకు): శ్రీవారి దశావతారాల్లో నాలుగోది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. యోగశాస్త్రంలో సింహం బలానికి (వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.
ముత్యపుపందిరి వాహనం (29న రాత్రి 7 గంటలకు): జ్యోతిష్యశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
కల్పవృక్ష వాహనం (30వ తేదీ ఉదయం 8 గంటలకు): క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది.
సర్వభూపాల వాహనం (30వ తేదీ రాత్రి 7 గంటలకు): సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
మోహినీ అవతారం (అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం): బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడు.