TDP reaction on YS Jagan Capital Comments: ''ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్టణం కాబోతోందని.. త్వరలో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో ఇన్వెస్టర్ల సదస్సుకు మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నాను.'' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచిన కారణంగానే సీఎం జగన్ ఉన్నపళంగా విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటన చేశారని.. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. వివేకానంద హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన చేశారన్నారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారిందన్నారు. ఆ కాల్ డేటా వివరాలను వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందని... ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్లో ఉంది.. ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టు ధిక్కరణే అవుతుందని పయ్యావుల కేశవ్ అన్నారు.
సీఎం జగన్ దిల్లీలో ఉన్నపళంగా ఈరోజు విశాఖే ఆంధ్రప్రేదేశ్ రాజధాని అంటూ చేసిన ప్రకటన వెనకాల అనేక రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయి. ఈరోజు, ఈ సమయాన్నే ఆయన ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. సుప్రీంకోర్ట్ వివేకానంద హత్య కేసును హైదరాబాద్‌కు తరలించడం, దానిలో భాగంగా సీబీఐ శరవేగంగా దర్యాప్తు మొదలుపెట్టడం కారణంగానే ఈ ప్రకటన చేశారు.- పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్