TDP LEADERS ON GANJA : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి అమ్మకాలు ముఖ్యమంత్రి జగన్‌కే సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డిని తక్షణమే టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరిగే గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని వర్ల నిలదీశారు.
గంజాయికి అడ్డగా టీటీడీని మార్చారు: రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారం, అక్రమ రవాణా అంతా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ వాళ్లే చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఆరోపించారు. రాష్ట్ర యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలు అయ్యారని.. వాటి వినియోగం బాగా పెరిగిందని విమర్శించారు. గంజాయి ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నివేదిక ప్రకారం 2018లో 6,600 కిలోల గంజాయి పట్టుబడితే, నేడు 2లక్షల 600 కిలోల గంజాయిని ఏపీ పోలీసులు పట్టుకున్నారని గుర్తు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గంజాయికి అడ్డాగా మార్చారని మండిపడ్డారు. తిరుమల కొండ పైకి గంజాయి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. సెక్యూరిటీ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా కొండ పైకి వాహనాల్ని అనుమతి ఇస్తున్నారని విమర్శించారు. తిరుమలలో గంజాయి దొరకడంతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న జగన్, అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
పవ్రిత కొండ మీద గంజాయి అమ్ముతుంటే ఏం చేస్తున్నారు: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక ప్రకారం గంజాయి రవాణాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని విమర్శించారు. 2021లో దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 26% ఉన్నట్లు ఏసీసీబీ నివేదికలో పేర్కొందన్నారు. రాష్ట్రం నుంచి రోజుకు టన్నుల కొద్దీ గంజాయి రవాణా అవుతుందని.. దీని బట్టి గంజాయి మాఫియాకు వైసీపీ నేతలు ఏ విధంగా సహకరిస్తున్నారో స్పష్టమవుతోందని దేవినేని ధ్వజమెత్తారు.