NARA LOKESH YUVAGALAM : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 20వ రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. కీలపూడి విడిది కేంద్రంలో ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్‌కు వివరించారు. స్పందించిన లోకేష్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని... కార్పొరేషన్ ద్వారా రుణాలు రావడం లేదని తెలిపారు. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని.. ఇప్పుడు విద్యుత్ బిల్లులు కట్టాలని వేధిస్తున్నారని ఆరోపించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న జగన్ ప్రభుత్వం మోసం చేసిందని. ఇప్పుడు ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారని అన్నారు.
ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పి.. ఎన్నికల తరువాత జగన్ మాట మార్చి మూడు రాజధానులు అని చెప్పి.. తరువాత చివరకు ఒకటే రాజధాని ఉంటుందని.. అది విశాఖపట్నం అంటున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమకి పట్టిన శని జగన్ అని.. కర్నూలు రాజధాని అని ఇంతకాలం మోసం చెయ్యడం.. తప్ప ఒక్క ఇటుక అయినా పెట్టారా? కొంచెం అయినా అభివృద్ది చేశారా?, ఒక్క పరిశ్రమ అయినా తీసుకువాచ్చరా? అని ప్రశ్నించారు. విశాఖకి జగన్ చేసింది, చేయబోయేది ఏమి లేదన్నారు. విశాఖ ప్రజల్ని రాజధాని పేరుతో మోసం చెయ్యడం తప్ప ఈ రోజు వరకూ కూడా ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదని ధ్వజమెత్తారు.