Nannuri Narsireddy Criticizes AP Speaker Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సింహారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో ప్రవేశమెలా పొందారు?.. అని ప్రశ్నించారు. గతంలో పలుమార్లు తమ్మినేనే.. తాను డిగ్రీ మధ్యలో ఆపేసినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారని... 2019 ఎన్నికల అఫిడవిట్‌లోనూ అదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి చదుల్లో ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై తమ్మినేని, ఉస్మానియా వర్శిటీ అధికారులు వెంటనే స్పందించాలని నర్శింహా రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నన్నూరి నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..''డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారు?. డిగ్రీ లేకుండానే తమ్మినేని సీతారాంకి 2019-20 సంవత్సరంలో మహాత్మాగాంధీ లా కాలేజీలో ఎలా అడ్మిషన్ వచ్చింది?. తాను డిగ్రీని మధ్యలోనే ఆపేశానని తమ్మినేని సీతారాం గారే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో సైతం అదే అంశాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు. తమ్మినేని సీతారాం గారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారని.. చదువుల్లో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన వారికి ఎల్‌ఎల్‌బీలో సీటు ఎలా వచ్చిందనే అంశంపై తమ్మినేని సీతారాంతోపాటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు స్ఫందిచాలి. అంతేకాదు, దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి, ఇలాంటి అక్రమాలు భవిష్యత్‌లో మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అంశంపై విచారణ జరిపితే.. ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు వస్తాయి. ఇప్పటికైనా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించి.. సభాసాక్షిగా లేక మీడియా సాక్షిగా అయినా.. ప్రజలకు అసలు విషయం తెలపాలి.'' అని నన్నూరి నర్సింహారెడ్డి పేర్కొన్నారు.