'CBN Connect Program with Women' updates: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కొరవడిందని, రోజురోజుకు వారిపై హింసలు, దాడులు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 8 గంటలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా 'సీబీఎన్ కనెక్ట్ పోగ్రామ్ విత్ ఉమెన్స్' కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు వివిధ వర్గాల మహిళలతో, వర్చువల్ విధానంలో పాల్గొన్న మహిళలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
నా తల్లి కష్టాన్ని చూసి దీపం పథకం తెచ్చాము: ఈ సందర్భంగా పలువురు మహిళలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచిన అనంతరం రాష్ట్రంలోని మహిళల కోసం ఏయే పథకాలు, భద్రత, విద్య, ప్రభుత్వ పాలసీలను ప్రవేశపెట్టనున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''తెలుగుదేశం పార్టీ 1986లోనే మహిళలకు ఆస్తి హక్కును కల్పించింది. తిరుపతిలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థల పదవుల్లో, విద్యలో ఆడపిల్లలకు రిజర్వేషన్‌లను తెచ్చింది టీడీపీనే. ఆనాడు కట్టెల పొయ్యిలపై వంట చేసిన నా తల్లి కష్టాన్ని చూసి తరువాత కాలంలో దీపం పథకం తెచ్చాం. నా జీవితంలో మొదటి గురువు మా అమ్మనే. నాడు తెచ్చిన 33శాతం రిజర్వేషన్ వల్ల.. విద్యలో ఆడ పిల్లలు మంచి అవకాశాలు పొందారు'' అని ఆయన వివరించారు.
అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ పునరుద్దరిస్తాం:వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మద్యం అమ్మకాలను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వైద్యం పూర్తిగా పడకేసిందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయంలో మహిళల కోసం, పుట్టిన బిడ్డల కోసం తీసుకొచ్చిన పథకాలన్నీంటిని జగన్ సర్కారు రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్నింటినీ మళ్లీ పునరుద్దరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, నాణ్యతలేని లిక్కర్ వాడకం పెరగడంతో.. క్రైం విపరీతంగా పెరిగిందని విమర్శించారు.