TTD hikes room rentals: గత కొంత కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు అనేక సంస్కరణలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలతో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. లడ్డు, బస్సు, టోల్ చార్జీలు, అద్దెగుదులు.. ఇలా టీటీడీలో వివిధ రకాల రేట్లను పెంచడంతో భక్తులపై తీవ్రమైన అర్థిక భారం పడుతోంది. తాజాగా గదుల అద్దె రేట్లు పెంచడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. వెంటనే పెంచిన రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశాయి. సౌకర్యాలు మెరుగుపరుస్తామనే సాకుతో అద్దె పెంచడం ఎంత వరకు న్యాయమో టీటీడీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
టీటీడీ గదుల అద్దె పెంపుపై.. స్పందించిన టీడీపీ నేతలు.. ఏమన్నారంటే ? - టీడీపీ
TTD hikes room rentals in Tirumala: తిరుమలలో గదుల అద్దె రేట్ల పెంపుపై టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు: భగవంతుడికి భక్తులను దూరం చేయడానికే తిరుమలలో అద్దె గదుల రేట్లను పెంచారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. మొన్న లడ్డూ రేట్లు, నిన్న బస్సు, టోల్ చార్జీలు, నేడు అద్దెగదుల రేట్ల పెంపు అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. 50 రూపాయల నుంచి 200 రూపాయలు ఉండే రేట్లను 750 రూపాయల నుంచి 2వేల 300 రూపాయలకి పెంచడం దురుద్దేశపూరితమని మండిపడ్డారు. టీటీడీ అనాలోచిత చర్యలతో భక్తుల్లో పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయని ఆక్షేపించారు.
భక్తులకు సౌకర్యాలు కల్పించకపోగా వివిధ రూపాల్లో భారం మోపడం దుర్మార్గమైన చర్యని కిమిడి ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో కూడిన తిరుమలను వ్యాపారసంస్థలా మార్చడం దారుణమన్నారు. భగవంతుడికి భక్తులను దూరం చేసే చర్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తేల్చిచెప్పారు. పెంచిన అద్దెగదుల రేట్లను టీటీడీ వెంటనే విరమించుకోవాలని కిమిడి కళా వెంకట్రావు కోరారు.