Tirupati Gangamma Jatara: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. వేద పండితులు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి.. జాతరను వైభవోపేతంగా ప్రారంభించారు. దర్శనానికి తరలివచ్చిన భక్తులతో గంగమ్మ ఆలయం కిటకిటలాడింది. చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులంతా బైరాగి వేషంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారె సమర్పించారు. బుధవారం ఉదయం స్థానిక పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి సమర్పించే సారెను పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఊరేగింపులో అమ్మవార్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబద్ధంగా చిందేస్తూ పులకించిపోయారు. నవదుర్గలు, కాంతారా, తప్పేటగుళ్ళు, డప్పలు, తీన్మార్, కీలుగుర్రాలు, పగటివేషగాళ్లు, బోనాల కళా ప్రదర్శనలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
గంగమ్మ ఆలయంతో పాటు తిరుపతిలో వెలసిన వేషాలమ్మ గుడిలోనూ ఏకకాలంలో జాతర నిర్వహిస్తారు. గంగమ్మ జాతరలో వేషాలు కట్టే భక్తులు.. వేషాలమ్మ గుడి నుంచి యాత్రను ప్రారంభించడం సంప్రదాయం. ఈ ఏడు రోజుల పాటు రోజుకో వేషంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తొలిరోజు బైరాగి వేషంలో అమ్మవారికి పొంగళ్లు, అంబలి సమర్పించారు.
భక్తులు రోజుకో వేషంతో అమ్మవారిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమని.. అదే ఈ పండగ ప్రత్యేకతని వేషాలమ్మ ఆలయ అర్చకులు తెలిపారు. ఆఖరి రోజున నిర్వహించే చప్పరాల ఊరేగింపు వరకు తాతయ్యగుంట తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా సాగనుంది.