BJP National Secretary Sunil Deodhar: తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్ధాయి ప్రతిభా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని... వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైనది కాదన్నారు. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన అన్నారు. తితిదేలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని.. గత కొన్ని రోజుల ముందు తితిదే ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
'జగన్ ఏపీకి సీఎం కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. తెలుగు భాషను అంతం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక తెలుగు పాఠశాలలు మూశారు. కేవలం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీటీడీలో అనేక మార్పులను తీసుకువచ్చారు. తద్వారా ఆలయ పవిత్రను దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ 175 సీట్లు గెలుచుకుంటుందని అంటున్నారు. ఎవరు గెలుస్తారో అనేది సమయమే నిర్ణయిస్తోందన్నారు. వైసీపీతో కలిసే సమస్యే లేదు. తప్పుచేసిన వారెవరైనా జైలుశిక్ష అనుభవించక తప్పదు. వైఎస్ వివేకా హత్య కేసులో అదే జరుగుతోంది. సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైనది కాదు. ఆధారాలు ఉన్నందునే అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో నిజం లేదు. ఏడుకొండల వాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదు.'- సునీల్ దియోధర్, బీజేపీ జాతీయ కార్యదర్శి