Rangampeta MPTC Allegations on Sri Vidyanikethan: శ్రీ విద్యానికేతన్‌కు చెందిన పీఆర్ఓ సతీష్, సునీల్ చక్రవర్తి పంపిన కొందరు వ్యక్తులు తమ హత్యకు కుట్ర చేశారని చంద్రగిరి మండలం, రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి బాలాజీ కాలనీలో నివాసం ఉంటున్న ఎంపీటీసీ సభ్యుడు బోస్ చంద్రారెడ్డిని హత మార్చేందుకు ఆరుగురు దుండగులు విఫలయత్నం చేశారని బాధితులు ఆరోపణ చేశారు. వారిలో హేమంత్ అనే యువకుడిని పట్టుకొని బోస్ చంద్రారెడ్డి అనుచరులు చంద్రగిరి పోలీసులకు అప్పగించారు.
తొలుత ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డిపై, అతని ఇంటిపై ఆరుగురు దుండగులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమై వారిలో ఒకరిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన హేమంత్గా గుర్తించారు. అతనిని అడగగా.. రంగంపేట ఎంపీటీసీ సభ్యులు బోస్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మౌనిష్ రెడ్డిని చంపడానికి వచ్చామని చెప్పినట్లు బాధితులు అన్నారు.
చంద్రగిరిలోని శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. నిందితులకు ఫోటోలు పంపించి రూ.3 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపారని బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. రంగంపేట పంచాయతీ పరిసర ప్రాంతాల్లోని సుమారు ఎనిమిది కోట్ల విలువ గల డీకేటీ భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.