SOMASILA CANAL : తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సాగునీరు.. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజవకర్గాల ప్రజలకు తాగునీరు అందించే సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాల్వ పరిస్థితి దారుణంగా మారింది. 350 కోట్ల రూపాయల అంచనాలతో సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణాలు ప్రారంభించి... దాదాపు 220 కోట్ల మేర ఖర్చుపెట్టి కొంత మేర నిర్మాణాలు పూర్తిచేసి నీటిని విడుదల చేశారు. కానీ గడచిన మూడేళ్లలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయకపోగా...ఇప్పటికే పూర్తైన కాలువ నిర్వహణకూ నిధులు కేటాయించలేదు. ఫలితంగా కాలువ నిర్వహణ సరిగ్గా లేక పిచ్చిమొక్కలు పెరిగి వాటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది.
జిల్లాలోని రాపూరు, డక్కలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లోని లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సోమశిల - స్వర్ణముఖికాలువ పనులు చేపట్టారు. ఈ కాలువ నుంచే పరిసర ప్రాంతాల జలాశయాలను నింపి 140 గ్రామాలకు తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించారు.