ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kidney Problems: మరో ఉద్దానంలా 'వడ్డికండ్రిగ'.. రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ బాధితులు - తిరుపతి జిల్లా తాజా వార్తలు

Kidney Problems: ఆ దంపతులిద్దరూ కిడ్నీ జబ్బులతో మంచం పట్టారు.. పదేళ్ల కిందట భర్తకు మూత్రపిండాల సమస్య రాగా, ఇటీవల భార్యలోనూ బయటపడింది. కూలి పనులు చేసుకొనే ఇద్దరూ మంచాన పడటంతో వారి కూతురు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ నెలనెలా వీరికి రూ.10 వేలు ఖర్చు చేస్తోంది. కుటుంబ అవసరాలు, చికిత్స కోసం ఇప్పటికే ఎకరం పొలం అమ్ముకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం వడ్డికండ్రిగలో జరిగింది.

Kidney Problems
వడ్డికండ్రిగలో రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ బాధితుల సంఖ్య

By

Published : Apr 29, 2022, 7:43 AM IST

Kidney Problems: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం గొట్టుప్రోలు పంచాయతీ శివారులోని వడ్డికండ్రిగ పల్లెవాసులను మూత్రపిండాల వ్యాధి పీడిస్తోంది. గ్రామంలో 100 కుటుంబాలు, సుమారు 500 జనాభా ఉండగా 40 మంది కిడ్నీ జబ్బులతో బాధ పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, కృష్ణా జిల్లా ఎ.కొండూరు ప్రాంతాల్లోనూ ఇదే తరహా సమస్య కొన్నాళ్ల కిందట వెలుగుచూసింది. చిన్నగ్రామమైన వడ్డికండ్రిగలోనూ పదుల సంఖ్యలో బాధితులు ఉండటం తీవ్రతను చాటుతోంది. కూలీనాలీ చేసుకొని బతికే పేద కుటుంబాల్లో ఒకరిద్దరు వ్యాధిబారిన పడటంతో సంసారాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మొదట్లో నడుం, కాళ్లు, కీళ్ల నొప్పులు, జ్వరాలు రావడంతో పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏడాదిగా వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోయింది. అయినా చాలామందికి పింఛన్లు రావడం లేదు. కొందరు డయాలసిస్‌ చేయించుకుంటుంటే మరికొందరు మందులు వాడుతూ రూ.లక్షల్లో చేస్తున్నారు. కొంతమందికి ప్రతినెలా రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టుకొని పొలాలు అమ్మిన కుటుంబాలూ ఉన్నాయి.

నీటి పరీక్షల్లో సాధారణం:గ్రామంలో గతంలో నీటి పరీక్షలు చేయగా, ఎలాంటి అసాధారణ ఫలితాలు బయటపడలేదు. 15 రోజుల కిందట మరోసారి నీటి నమూనాలు సేకరించారు. వడ్డికండ్రిగకు చిట్టమూరు మండలం జంగాలపల్లి వద్దనున్న స్వర్ణముఖి నది నుంచి తాగునీటి పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కూలి పనులకు వెళ్లే వీరు పని ప్రదేశాల్లో దొరికే నీరే తాగుతారు. స్థానిక వైద్యుడు క్రాంతికిరణ్‌ మాట్లాడుతూ ‘కూలి పనులకు వెళ్లేవారు నీరు తగినంత తాగకపోవడంతో కిడ్నీ వ్యాధి బారినపడే ప్రమాదముంది. రక్తపోటు నియంత్రణలో లేకపోయినా సమస్య వస్తుంది. ఇటీవల బోరు నీటిని పరీక్షలకు పంపించాం. ఫలితాలు రావాల్సి ఉంది.

వ్యాధి తీవ్రతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామ’ని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేయడంతోపాటు వ్యాధి మూలాలపై నిగ్గు తేల్చాలని, పిల్లలు రోగాల బారిన పడకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: రూ.1.80 లక్షలతో ఇంటి నిర్మాణమెలా..? కలెక్టర్‌ను ప్రశ్నించిన వృద్ధుడు

ABOUT THE AUTHOR

...view details