Lokesh Yuvagalam: స్థానిక సంస్థల్లో బీసీలకు 20 నుంచి 34 శాతానికి రిజర్వేషన్లు పెంచిన ఘనత చంద్రబాబుదైతే.. 24 శాతానికి తగ్గించిన ఘనత జగన్రెడ్డిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రెండో రోజు చేపట్టిన యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివరామపురానికి చేరుకుంది. శివరామపురంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
పాదయాత్ర ద్వారా అందరికి న్యాయం చేస్తానన్న జగన్.. సంక్షేమంలో కోత వేశారని ఆరోపించారు. బోయలను ఎస్టీలలో చేరుస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కురుబ కులస్థులకు గ్రామ గ్రామాన ఆలయాలు కట్టిస్తామని.. ఆలయ నిర్మాణాల కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వడ్డెర్లకు గనులలో రాళ్లు కొట్టుకొనే అవకాశం పునరుద్ధరిస్తామన్నారు.
జగన్లాగా తప్పుడు హామీలివ్వనని.. పూర్తి స్థాయిలో పరిశీలన చేశాక అమలు చేయగలిగే వాటిపైనే హామీ ఇస్తానన్నారు. ప్రజలను యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యం చేద్దామన్నారు. శాసనసభలో తమ తల్లిపట్ల అగౌరవంగా మాట్లాడిన వారిని వదలిపెట్టనని హెచ్చరించారు. దొంగ బీసీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.