Jallikattu Begins At Rangampet Village: పశువుల పండుగను నిర్వహించేందుకు తిరుపతి జిల్లా ఎ. రంగంపేట సన్నద్ధమైంది. తరాలుగా ఆనవాయితీగా వస్తోన్న పశువుల పండుగను ఎప్పట్లాగే ఘనంగా నిర్వహిస్తామని రంగంపేట ప్రజలు చెబుతున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టినా.. మా సంప్రదాయం మాదేనంటూ.. ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పశువుల పండుగ ఆనవాయితీ..యువత పరుగులు: కనుమ పండుగను తమదైన రీతిలో ఘనంగా జరుపుకుంటారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేట ప్రజలు. కనుమ రోజున పశువుల పండుగ నిర్వహించడం ఎ.రంగంపేటలో ఆనవాయితీగా వస్తోంది. పశువులను అందంగా అలంకరించి వాటి కొమ్ములకు చెక్క పలకలు, పసుపు టవళ్లు కడతారు. అనంతరం వాటిని పరిగెత్తిస్తారు. అలా పరుగులు తీస్తున్న పశువుల కొమ్ములకు కట్టినవాటిని సొంతం చేసుకునేందుకు.. యువత వాటితో పాటు పరుగులు పెడతారు. అలా పశువుల కొమ్ములకు కట్టినవాటిని సాధించడాన్ని గొప్పగా వారు భావిస్తారు. ఈ క్రమంలో అనేక మందికి గాయాలవుతుంటాయి.
ఎ. రంగంపేట ప్రజలు ఏర్పాట్లు: దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్రీడపై పోలీసులు కొంత కాలంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. వీటిని కలిసికట్టుగా ఎదుర్కొంటూ వస్తున్న ఎ.రంగంపేట ప్రజలు పశువుల పండుగను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేడు కనుమ సందర్భంగా పశువుల పండుగను నిర్వహించేందుకు ఎ.రంగంపేట ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.