Naravaripalli Village : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె.. ముందుగానే సంక్రాంతి శోభను సంతరించుకుంది. పండుగ సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు నాలుగు సంవత్సరాల తర్వాత స్వగ్రామానికి రానుండడంతో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు సంబరాలు జరుపుకుంటున్నారు.
గత నాలుగు సంవత్సరాలలో ఒక సంవత్సరం అమరావతి రైతులకు మద్దతు, మరో మూడు సంవత్సరాలు కరోనా కారణంగా స్వగ్రామానికి రాకపోవడంతో పండుగ జరుపుకోలేదు. ఈ సంవత్సరం వారు స్వగ్రామానికి వస్తుండడంతో చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్ పులివర్తి నాని, మండల నాయకులు, గ్రామస్థులతో కలిసి నారావారిపల్లెను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
గత మూడు సంవత్సరాలుగా గ్రామంలో పండుగ నిర్వహించుకోలేకపోయామని.. ఈసారి చంద్రబాబు కుటుంబం రాకతో పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. స్వాగతం పలికే బ్యానర్లు, ప్రతి ఏడాది జరిపే ముగ్గుల పోటీలను నిర్వహించేందుకు స్థలాన్ని.. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలు, నాయకులకు భోజనం, తాగునీటి వసతి , వాహనాలు నిలుపుకునేందుకు స్థలం, ప్రజలను కలిసేందుకు స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు.
బాలకృష్ణ, చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఎద్దుల బండిపై గ్రామంలో తిరుగుతూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారని సమాచారం. అందుకు సంబంధించిన ఎడ్ల బండిని సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు సాయంత్రానికి నారా, నందమూరి కుటుంబం నారావారిపల్లెకు చేరుకుంటుందని సమాచారం.
సంక్రాంతికి ముస్తాబైన నారావారిపల్లె.. అధినేత కోసం ఎదురుచూపులు ఇవీ చదవండి: