Road Accidents in the State: రోడ్డు ప్రమాదంలో ఏదైనా అయితే.. అది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా.. కొన్ని కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తుంది. అందుకే నిత్యం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలు.. వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధి అడ్డరోడ్డు వద్ద కారును ఊక లారీ ఢీకొంది. తెనాలిలో పెళ్లికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విస్సన్నపేటకు చెందిన కారు యజమాని గుప్తా లాలుతో పాటు కారులో ప్రయాణిస్తున్న సంక సునీత మృతి చెందగా, సునీత భర్త రాంబాబు పరిస్థితి విషమంగా ఉంది. అంబులెన్స్‌లో క్షతగాత్రుడు రాంబాబును విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖ జ్ఞానాపురంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతులు పట్టాభిరెడ్డి తోటకు చెందిన దినేష్ కుమార్ (27), పాత అడివివరం సింహాచలంకు చెందిన టి.రామానాయుడు (21) గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించిన కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.