Award for Balaji Hatcheries: నాణ్యతా ప్రమాణాలతో ఉత్తమమైన సేవలందించడం ద్వారా దివంగత డాక్టర్ సుందరనాయుడు స్ధాపించిన బాలాజీ హెచరీస్ సంస్ధ ప్రతిష్టాత్మకమైన హెచ్‍వైఎమ్ క్వాలిటీ అవార్డు సొంతం చేసుకుంది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హెచ్‍వైఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ నిర్వహించిన కార్యక్రమంలో తితిదే జేఈవో సదాభార్గవి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ హెచరీస్‌తో పాటు అపోలో వైద్య సంస్థలు, మెగా ఇంజనీరింగ్ సంస్థ, తాపేశ్వరం కాజా, దక్షిణ మధ్య రైల్వే వంటి 17 సంస్ధలు అవార్డులను సొంతం చేసుకున్నాయి.
నాణ్యమైన సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా హెచ్‍వైఎమ్ క్వాలిటీ అవార్డు రావడం అనందంగా ఉందని సుందరనాయుడు మనవడు, బాలాజీ హెచరీస్ ఎండీ ప్రణీత్ అన్నారు. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే లక్ష్యంతో బాలాజీ హెచరీస్ సంస్థ ద్వారా సుందరనాయుడు నిరంతరం శ్రమించారని ప్రణీత్ తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కిన సమయంలో ఆయన తమ మధ్య లేకపొవడం తీరని లోటన్నారు. ఆయన ఆశయాలను కోనసాగించడంలో ఇలాంటి అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయన్నారు.