Permanent Driving Lenience Problems : వాహనమిత్రలకు 10వేల రూపాయలు ఇస్తున్నామని గొప్పలు చెబుకుంటున్న ప్రభుత్వం.. వారికి అవసరమైన శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు మాత్రం ఇవ్వలేకపోతోంది. మూడేళ్లుగా లైసెన్సు కార్డులు జారీకాక వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వేల రూపాయలు అపరాధ రుసుం కట్టాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. రవాణా, హరిత పన్నుల పేరిట వందల రూపాయలు, అపరాధ రుసుముల రూపంలో వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేసే రవాణా శాఖ వాహన చోదకులు, వాహనాల యజమానులకు జారీ చేసే లైసెన్స్, ఆర్సీల శాశ్వత కార్డులు మాత్రం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వాహనం ఏదైనా నిబంధనలు సాకుగా చూపుతూ సవాలక్ష ప్రశ్నలు సంధించి అపరాధ రుసుము వసూలు చేయడమే పనిగా పెట్టుకున్న రవాణాశాఖ.. తన అసలైన బాధ్యతలను పూర్తిగా గాలికి వదిలేసింది. గత మూడేళ్లుగా వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్-ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల జారీ నిలిపివేసింది. కార్డుల స్థానంలో తాత్కాలికంగా కాగితాలు ఇస్తూ.. వాటినే లైసెన్స్‌లు, ఆర్సీలుగా భావించాలని సూచిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం సర్వీస్ ఛార్జ్, లైసెన్స్ కార్డు పేరుతో వందల రూపాయలు తీసుకొంటున్న రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, ఆర్సీలు మాత్రం జారీ చేయడం లేదని వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.