No compensation for Jagananna Colony lands : పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం... ఇళ్లను కాదు కాలనీలనే నిర్మిస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలతో ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం పేద రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల నుంచి జగనన్న కాలనీల కోసం ప్రభుత్వం సేకరించిన భూములకుమూడేళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదు. దీంతో సాగు చేసుకోవడానికి భూములు లేక పరిహారం అందక అన్నదాతలు దుర్భర జీవితం గడుపుతున్నారు. మూడేళ్ల కాలంలో పంటల రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోగా... పరిహారం అందక జీవనం సాగించడానికి చేసిన అప్పులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల కోసం సేకరించిన భూములకు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలపై ఈటీవీ ప్రత్యేక కథనం.
పెద్ద పెద్ద ప్రకటనలు.. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం... పేదల పక్షాన నేనున్నా.. నా ఎస్సీలు... నా బీసీలు... నా మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నా అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అదే పేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.తన పేరుతో నిర్మిస్తున్న కాలనీలకు చిన్న, సన్నకారు రైతుల నుంచి సేకరించిన భూములకు మూడేళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించడం లేదు. పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదని... వారం రోజుల్లో మీ ఖాతాల్లో నిధులు జమ అవుతాయంటూ అధికారులు కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.ప్రభుత్వ పరిహారం అందక సాగుచేసుకోవడానికి భూములు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.