నాలుగేళ్ల జగన్ పాలనలో ప్రజలకు నరకం: లోకేశ్ Nara Lokesh Yuvagalam Padayatra: నాలుగు సంవత్సరాల జగన్ పాలనలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 138వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా అన్నమేడు గ్రామస్థులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు వైసీపీకి చెందిన 50 కుటుంబాలు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
అన్నమేడు క్యాంపు సైట్లో లోకేశ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ఇసుక దందాకు.. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక ఇసుక విధానాన్ని.. ప్రక్షాళన చేస్తామన్నారు.
టీడీపీ హయాంలో ఇళ్లు కేటాయించడంతో నిర్మాణాలు ప్రారంభించామని.. ప్రభుత్వం మారిన తరువాత బిల్లులు ఇవ్వక ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయని గ్రామస్థులు లోకేశ్‌కు వివరించారు. రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు లోకేశ్ దృష్టికి తెచ్చారు. సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ రాయితీపై ఇవ్వడం లేదన్నారు.
లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలకు.. సైకో జగన్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నాడన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ చెత్త పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడవ స్ధానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్ధానంలో ఉందని ఆయన తెలిపారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది 20 వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకుంటామన్నారు. భూసార పరీక్ష కేంద్రాలు జగన్ ప్రభుత్వంలో మూతపడ్డాయని ఆరోపించారు. జగన్ మోటార్లకు మీటర్లు పెడుతున్నాడని.. మీటర్లు పెట్టకుండా అడ్డుకోవాలని తెలిపారు. జగన్ ముద్దులు, ఒక్క అవకాశంకి ప్రజలు పడిపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
"ముఖ్యమంత్రి జగన్ ఇసుక ద్వారా రోజుకు 3 కోట్ల రూపాయలు తింటున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇసుక విధానాన్ని ప్రక్షాళన చేస్తాం. తాగునీరు లేకుండా మీరంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి అందిస్తాం. గతంలో సంక్షేమ కార్యక్రమాలు చేసింది , అభివృద్ధి చేసింది, పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబే. పాలిచ్చే ఆవుని వద్దని.. తన్నే దున్నపోతును తీసుకొచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పది సీట్లు మాకు ఇవ్వండి.. ఈ జిల్లా రూపురేఖలు మార్చకపోతే నన్ను నిలదీయండి. దారి తప్పిన రాష్ట్రాన్ని.. మళ్లీ సరైన దారిలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం". - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి