Yuvagalam padayatra : నారా లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుచానూరు సమీపంలోని రాత్రి విడిది కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. భవన నిర్మాణ కార్మికులతో తిరుపతి నగరంలో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి పై ఆరోపణలు చేశారంటూ నిరసనకు దిగారు. ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అడుగడుగునా ఘన స్వాగతం.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 28వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు యువత, మహిళలతో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తిరుచానూరు సమీపంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగున ప్రజలు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతూ సంఘీభావం తెలిపాయి. పాదయాత్రలో భాగంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు. తిరుచూనూరు దర్శనానంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర సాగుతోంది.