Lokesh Yuvagalam Padayatra : నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో 28వ రోజు స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తిరుచానూరు సమీపంలోని విడిది కేంద్రం వద్ద వైకాపా కార్యకర్తలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. భవన నిర్మాణ కార్మికులతో తిరుపతి నగరంలో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యుడు కరుణాకర రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరుచానూరు సమీపంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభించిన పాదయాత్ర తిరుచానూరు, వసుంధర నగర్, తనపల్లి, భాగ్యనగరం, కూపుచంద్రపేట, దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, శివగిరి విడిది కేంద్రం వరకు 13.2 కిలోమీటర్లు సాగింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని లోకేశ్ దర్శించుకున్నారు. మహాలఘు దర్శనంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు.
పాదయాత్రలో లోకేశ్‌కు అడుగడుగునా ప్రజలు, తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తనపల్లి సమీపానికి చేరుకున్న లోకేశ్ వరదలకు కొట్టుకపోయిన కాజ్ వే ని పరిశీలించారు. స్వర్ణముఖి నదిపై నిర్మించిన కాజ్ వేలు 2021లో వచ్చిన వరదలతో కోతకు గురయ్యాయని స్ధానికులు తెలిపారు. రెండేళ్లు గడుస్తున్నా వాటిని నిర్మించలేదని లోకేశ్‌కు వివరించారు. అసమర్థ, పాలనా అనుభవం లేని ముఖ్యమంత్రితో సమస్యలు ఎదురవుతున్నాయని లోకేశ్ ధ్వజమెత్తారు. వర్షాకాలంలో కనీస అంచనాలు లేకుండా జగన్ ప్యాలస్‌లో పడుకోవడం వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 60 మందిని పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని... కాజ్ వేలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.