NARA LOKESH YUVAGALAM : వైఎస్సార్సీపీ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నందమూరి తారకరత్న మరణించిన నేపథ్యంలో పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేశ్.. రెండు రోజుల తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా మైనారిటీ నాయకులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. మైనారిటీల్లో పేదరికాన్ని గుర్తించిన ఎన్టీఆర్.. మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీ కార్పొరేషన్ తీసేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే తిరుపతి పార్లమెంట్లో మహిళలకు రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించిన లోకేశ్.. ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ హయాంలో మైనారిటీలకు అందించిన సాయాన్ని వివరించారు.
"స్వర్గీయ నందమూరి తారకరామారావు రాష్ట్రంలో మైనార్టీల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2019 వరకూ ఎన్ని ప్రభుత్వాలు మారినా కార్పొరేషన్ల ద్వారా మైనార్టీలను ఆదుకున్నారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అన్యాయం చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకూ దానిని అమలుచేయలేదు"-నారా లోకేశ్