ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాశివరాత్రి పర్వదినం.. ముక్కంటి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు - mahashivratri 2023

SHIVRATRI: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గరళకంఠుడి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే భక్తులు బారులుతీరారు. శివరాత్రి వేళ పలు శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

SHIVRATRI
SHIVRATRI
author img

By

Published : Feb 18, 2023, 8:36 AM IST

MAHASHIVRATRI 2023 : రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ముక్కంటిని దర్శించుకోవడానికి వేకువజాము నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తుతున్నారు. నీలకంఠుడి దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంలో ఒలలాడుతున్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని పుష్పాలు, పండ్లు, విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. వేకువజామున రెండు గంటల నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆర్జిత సేవలు, రాహు కేతు పూజలు రద్దు చేశారు.

శ్రీకాళహస్తిలో వైభవంగా శివరాత్రి: సర్వదర్శనం, వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కొంత మేర స్వల్ప తోపులాటలు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ మంజూరు తారక శ్రీనివాసులు, ఈవో విద్యాసాగర్ బాబు క్యూలైన్లను పర్యవేక్షించారు. ఉదయం ఇంద్ర విమానం, చప్పరం వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ ఆది దంపతులు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పాతాళగంగలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల రద్దీతో పాతాళగంగ ప్రాంతం కిటకిటలాడుతోంది. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తలు పోటెత్తారు. ఈరోజు రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు నంది వాహనసేవ నిర్వహించన అనంతరం.. మల్లికార్జున స్వామికి జగద్గురు పీఠాధిపతి అభిషేకం నిర్వహించనున్నారు. రాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మల్లికార్జునస్వామి ఆలయానికి పాగాలంకరణ అనంతరం రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం జరపనున్నారు.

కోటప్పకొండ త్రికోటేశ్వరునికి బిందెతీర్థంతో అభిషేకం: రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు అందంగా ముస్తాబైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం జరగనున్న తిరునాళ్ల మహోత్సవ వేడుకలకు భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరునాళ్ల వేడుకలకు ఆలయాన్ని పుష్పగుచ్చాలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. తిరునాళ్లకు కోటప్పకొండ వచ్చే భక్తులకు ప్రసాదాల కోసం ఆలయాధికారులు అధిక సంఖ్యలో లడ్డులు, అరిసెలు తయారు చేయించారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.

దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బంది కలుగకుండా క్యూ లైన్ల వద్ద అధికారులు చలువ పందిళ్లు వేశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 2 గంటలకు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామికి బిందెతీర్థం తో ఆలయ అర్చకులు తొలిపూజను ప్రారంభించారు. అదేవిధంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము దాకా త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

అలాగే కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి 265 ప్రత్యేక బస్సులను కోటప్పకొండకు నడపనున్నట్లు నరసరావుపేట ఆర్టీసీ డీఎం వీరాస్వామి తెలిపారు. తిరునాళ్ల వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండ దిగువన తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం బొమ్మల దుకాణాలు కొలువుదీరాయి. త్రికోటేశ్వరునికి ఇష్టమైన 110 అడుగుల భారీ విద్యుత్తు ప్రభలను కోటప్పకొండ చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు ఒకరోజు ముందుగానే కొండకు తరలించారు. మరి కొన్ని ప్రభలు పండుగ రోజు సాయంత్రం కల్లా కొండకు చేరుకొని భక్తులను అలరించనున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details