Kurumurthy Devasthanam Brahmotsavam: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. కోట్లాది జనుల ఆరాధ్య దైవం మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. దీపావళి పర్వదినం మొదలుకొని నెల రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా జరగనున్నాయి. వైభవంగా సాగే ఈ జాతరకు లక్షలమంది భక్తులు హాజరుతారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాక రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు హాజరవుతుంటారు. కుబేరుడి నుంచి తప్పించుకునేందుకు భూలోకంలో విహరించిన విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో కృష్ణానదిని దాటారని.. స్వామివారి స్పర్శకు పులకరించిన కృష్ణమ్మ.. ఆ భగవంతుకుని పాదుకలు సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామివారు ఈ కొండపై స్వయంభువుగా వెలశాడని పురాణ గాధ.
కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం:కొండపై కొలువుదీరిన కురుమూర్తిని సేవించినా అట్టంహాసంగా జరిగే ఉద్దాల ఉత్సవంలో స్వామి వారి పాదుకలను దర్శించినా.. సకల బాధలు తొలగడంతో పాటు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. జాతర ముఖ్య ఘట్టాలైన అలంకరణ ఉత్సవం, ఉద్దాలోత్సవం ఈ నెల 30, 31 జరగనున్నాయి. భక్తుల కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రాజగోపారం ప్రధాన ఆకర్షణ నిలిస్తోంది. మంచినీళ్లు, మరుగుదొడ్లు, కోనేరు వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు.