ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Janasena Leaders: "పోలీసుల విలువలు గుర్తుచేయడానికే తిరుపతికి పవన్​ రాక"

Janasena Leaders on Pawan Tirupati Tour: కొంతమంది పోలీసులు అధికార పార్టీకి ప్రైవేట్​ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ పసుపులేటి హరిప్రసాద్​ ఆరోపించారు. పోలీసు వ్యవస్థలోని విలువలను గుర్తు చేయడానికే జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ తిరుపతి వస్తున్నారని తెలిపారు.

Janasena Leaders
Janasena Leaders

By

Published : Jul 16, 2023, 12:45 PM IST

Updated : Jul 16, 2023, 2:57 PM IST

Janasena Leaders on Pawan Tirupati Tour: పోలీసు వ్యవస్థలోని విలువలను గుర్తు చేయడానికే జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ తిరుపతి వస్తున్నారని ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ పసుపులేటి హరిప్రసాద్​ తెలిపారు. తిరుపతి ప్రెస్​క్లబ్​లో శనివారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి ప్రైవేట్​ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి, ప్రజలకు సేవకులుగా ఉండాలే తప్ప రాజకీయ పార్టీలకు కాదని సూచించారు.

శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్​.. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేసిన దాడిని ఖండించడానికి, అలాగే జనసైనికులకు భరోసా కల్పించడానికి పవన్​కల్యాణ్​ తిరుపతికి వస్తున్నారని తెలిపారు. పవన్​ కల్యాణ్​.. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకోని శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ దాడి ఘటనపై ఎస్పీకి వినతి పత్రం సమర్పిస్తారని తెలిపారు. పవన్ పర్యటన వివరాలను జిల్లా ఎస్పీకి తెలియజేశామని... ప్రోటోకాల్ ప్రకారం రక్షణ, బందోబస్తు కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అని స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది: జనసేన అధినేత పవన్​ కల్యాణ్​పై సీఎం జగన్​ వ్యాఖ్యలను నిరసిస్తూ.. జులై 12న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్​.. జనసేన నాయకుడు కొట్టే సాయిపై చేయిచేసుకున్నారు. రెండు చెంపలు వాయిస్తూ రెచ్చిపోయారు. దీంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై జనసేన కార్యకర్తలు కూడా తీవ్రంగా ఆగ్రహించారు. ఈ విషయంపై స్పందించిన పవన్​.. సోమవారం తిరుపతి వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి అంజూయాదవ్​పై ఫిర్యాదు చేయనున్నారు.

సోమవారం సాయంత్రం దిల్లీకి పవన్​: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సీఐ అంజూయాదవ్​పై ఎస్పీకి ఫిర్యాదు చేసి జనసైనికులకు భరోసా కల్పించిన అనంతరం సాయంత్రం పవన్​ దిల్లీకి వెళ్లనున్నారు. ఈనెల 18న భారతీయ పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. కాగా, పవన్ కల్యాణ్ సైతం ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 18న దిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశానికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Last Updated : Jul 16, 2023, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details