ILLEGAL SOIL EXCAVATIONS : శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని ఉన్న కైలాసగిరుల్లో ఇస్టానుసారంగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు పాతరేసి కొందరు అక్రమార్కులు ఇక్కడి మట్టిని విక్రయించి జోబులు నింపుకుంటున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని 5,840 ఎకరాలలో కైలాసగిరులు వ్యాపించి ఉన్నాయి. కైలాసగిరి ప్రదక్షిణ మార్గం నిర్మించి 3 నెలలైనా కాకుండానే రూపు రేఖలు మారిపోయాయి.
సిరులు పండించుకుంటున్న అక్రమార్కులు :తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆనుకుని 361, 362 సర్వే నెంబర్ పరిధిలోని 5,840 ఎకరాలలో కైలాసగిరిలు వ్యాపించి ఉన్నాయి. ఇటీవల అక్రమార్కుల కళ్ళు ఇక్కడ కైలాసగిరి ప్రాంతంపై పడ్డాయి. అయితే ఇక్కడ భూములు ప్రస్తుతం అక్రమార్కులకు అడ్డాగా మారిపోయాయి. ఇష్టానుసారంగా జరుగుతున్న ఆక్రమణలతో ఇప్పటికే కైలాసగిరిలు రూపు రేఖలు మారిపోయాయి. ప్రతి రోజు సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాళ్లకు ఎంత వీలైనంతగా కొండను తవ్వి ఇక్కడ మట్టిని కొల్లగొడుతూ తరలిస్తున్నారు. కైలాసగిరుల్లొని రామచంద్రా పురం, రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాలకు దగ్గరలో మట్టి తొలగింపుతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వేడాం, రామాపురం, మిట్ట కండ్రిగ గ్రామాల సమీపంలోనూ మట్టిని విక్రయిస్తూ సిరులు పండించుకుంటున్నారు అక్రమార్కులు.
అధ్వానంగా మారిన రహదారులు : మట్టి తరలింపు టిప్పర్లు, ట్రాక్టర్ల కారణంగా పదహారు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కైలాసగిరి ప్రదక్షిణ మార్గం కాస్త గుల్లగా మారింది. రోడ్డు నిర్మాణం పూర్తి చేసి 3 నెలలు గడవక ముందే రూపు రేఖలు మారిపోయాయి. పలు చోట్ల సిమెంట్ రోడ్డు కాస్త పగుళ్లు ఏర్పడ్డాయి. ఇలాగే వదిలి పెడితే ఏడాది లోపు ఈ రోడ్డు రూపు రేఖలు పూర్తిగా మారిపోవడం తథ్యమని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. రాత్రంతా వాహనాల రాకపోకలు, వాళ్లు వాహానాలను వేగం నడపడంతో కంటి మీద కునుకు లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ధర్మకర్త మండలికి తెలిసే జరుగుతున్న మిన్నుకుండి పోవడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా మట్టి మాఫియా అక్రమాలకు కళ్లెం వేసే దిశగా అధికారులు శ్రద్ధ చూపాల్సి ఉంది.