ఎర్రకొండను కొల్లగొడుతున్న అక్రమార్కులు Yerpedu Errakonda : తిరుపతి జిల్లాలోని ఏర్పేడుకు ల్యాండ్ మార్క్‌గా పేరుగాంచిన ఎర్రకొండ రాబోయే రోజుల్లో కనుమరుగయ్యేలా ఉంది. అక్రమార్కుల చేతుల్లో చిక్కిన ఎర్రకొండ రోజురోజుకు.. కుచించుకుపోతోంది. కొండ నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తుండటంతో కనుమరుగు కానున్నదనే సందేహం కలుగుతోంది. ఫ్లై ఓవర్ నిర్మాణానికి కొండను తవ్వటానికి కొంతమేరకు అనుమతులు ఉండగా.. ఇదే అదనుగా భావించిన గుత్తేదారులు కొండను పూర్తిగా తవ్వుతూ పిండిగా మారుస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు.
ఏర్పేడు-వెంకటిగిరి మార్గంలో గల రైల్వే ట్రాక్‌పై ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనులు గతంలో ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను నిర్మించాలంటే ఎర్రకొండను కొంత చదును చేయక తప్పదు. దీంతో కొండను కొంత భాగం తవ్వి చదును చేయటానికి అధికారులు అనుమతులిచ్చారు. దీనిని అవకాశంగా మార్చుకున్న అక్రమార్కులు.. కొండను అనుమతులకు మించి తవ్వటం ప్రారంభించారు. కొండ నుంచి మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండపై బాలకృష్ణ స్వామి ఆలయం ఉండగా.. ఇలా పూర్తిగా తవ్వితే అది కూడా ఉండకుండా పోతుందని స్థానికులు అంటున్నారు.
ఎర్రకొండను పూర్తిగా చదును చేస్తూ.. కొండ నుంచి మట్టిని తరలించటం మూమ్మాటికి మట్టి దందానే అని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొండలోని రాళ్లను ముక్కలు చేసేందుకు.. జిలిటెన్ స్టిక్స్ వాడి ముక్కలు చేస్తున్నారు. అవాసాలు ఉండే ప్రాంతంలో జిలిటెన్ స్టిక్స్ వినియోగానికి అనుమతులు లేవు. అయినా సరే వాటిని వాడుతున్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా.. యథేచ్ఛగా జిలిటెన్ స్టిక్స్ వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో వచ్చే భారీ శబ్దాలు భయాందోళనను కలిగిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడి నుంచి తరలించిన మట్టిని రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్నామని జాతీయ రహదారుల అధికారి ఒకరు తెలిపారు. ఎర్రకొండ 220 మీటర్ల విస్తీర్ణంలో ఉందని.. ఫ్లై ఓవర్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం 45 మీటర్ల వరకు ఉంటుందని ఆయన వివరించారు. కొండ నుంచి రాళ్లు రోడ్డుపై పడకుండా ఉండేందుకు.. ముందు జాగ్రత్తగా 90 మీటర్ల వరకు చదును చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొండ పూర్తిగా బండరాయితో నిండి ఉందని.. నిర్దేశించిన కొలతల్లో తవ్వటానకి వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తోందని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి :