TTD EO Dharma Reddy: న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయనందుకు.... తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ నెల 27లోపు హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి ఈ మేరకు మంగళవారం తీర్పు ఇచ్చారు. ముగ్గురు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు ఆదేశాలను పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధించిన హైకోర్టు - ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారం
18:07 December 13
కోర్టు ధిక్కరణ కేసులో నెలరోజులు జైలు శిక్ష
టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టు జైలు శిక్షతోపాటు.. 2 వేల రూపాయల జరిమానా విధించింది. న్యాయస్థానం ఆదేశాలను అమలుచేయనందున... కోర్టు ధిక్కరణ కేసులో నెల రోజుల సాధారణ జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. ముగ్గురు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ ఇచ్చింది. దానిని సవాల్ చేస్తూ కొమ్ము బాబు, ఆర్. స్వామి నాయక్, బి. సేవ్లానాయక్‌అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. తాము ప్రోగ్రాం అసిస్టెంట్లుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నామని... తమను క్రమబద్ధీకరించేలా టీటీడీని ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఏప్రిల్ 13న విచారణ జరిపిన న్యాయస్థానం.. నోటిఫికేషన్‌ను కొట్టేసి.. పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆదేశించింది.
ఆ ఉత్తర్వులను అమలు చేయలేదని పేర్కొంటూ.. బాబు, మరో ఇద్దరు జూన్‌లో ధిక్కరణ వ్యాజ్యం వేశారు. వారి తరఫున న్యాయవాది కేకే దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. టీటీడీ ఈవో కౌంటర్ దాఖలు చేస్తూ.. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం ముందు జూన్ 20న అప్పీల్ వేయగా.. అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. కోర్టు ఆదేశాల అమలుకు కాలపరిమితి విధించలేదని చెప్పారు. ఈవో తదితరుల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అప్పీల్ పెండింగ్‌లు ఉండగా.. ధిక్కరణ కేసులో సహజంగా విచారణ చేయకూడదన్నారు. ఆ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈవో వేసిన కౌంటర్ పరిశీలిస్తే.. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ప్రతివాదుల వైఖరి స్పష్టమవుతోందన్నారు. కోర్టు ఆదేశాలను గరిష్ఠంగా రెండు నెలల్లో అమలు చేయాలన్న విషయం తెలిసినా.. ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తేల్చారు. ధిక్కరణ కింద టీటీడీ ఈవో ధర్మారెడ్డి శిక్షకు అర్హులని పేర్కొంటూ.. నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని.. సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ ధర్మాసనాన్ని కోరారు. బుధవారం విచారణ జరుపుతామని.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన ధర్మాసనం తెలిపింది. మరోవైపు గతంలో వేసిన అప్పీల్‌పై అత్యవసర విచారణ జరపాలని.. టీటీడీ తరఫు న్యాయవాది కోరగా.. ధర్మాసనం విచారణ జరిపి.. కొమ్ము బాబు, మరో ఇద్దరి సర్వీసును క్రమబద్ధీకరించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
ఇవీ చదవండి: