High Court Hearing on TTD Board Members Appointment:తితిదే బోర్డు సభ్యులుగా ఉంటూ.. దేవ దేవుడికి సేవ చేయాలని వేల మంది ఆశ పడుతూ ఉంటారు. అలాంటి వారు కేవలం భక్తి భావనతో మాత్రమే దేవుడి సేవలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఉంటారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యులుగా కొనసాగేందుకు దేశవ్యాప్తంగా ఉండే శ్రీనివాసుని భక్తులు పోటీ పడుతుంటారు. అందు కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. అలా వారికి తోచిన పైరవీలు చేసుకుంటారు. ఇదంతా గత కొంతకాలంగా కొనసాగుతున్నా.. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్నవారినో.. తమ పార్టీకి చెందిన వారికో.. ఆ బాధ్యతలు అప్పగించడం పరిపాటిగా మారింది. కానీ ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం.. ఛైర్మన్, ధర్మకర్తల మండలి ( Board of Trustees ) ని నియమించిన అంశంపై వివాదం చెలరేగిందనే చెప్పుకోవాలి. మొదట తిరుమల తిరుపతి దేవస్థానంఛెర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంతో మెుదలైన రాజకీయ రచ్చ.. తితిదే బోర్డు (TTD Board) సభ్యుల నియామకంలో సైతం కొనసాగుతోంది. తాజాగా తితిదే బోర్డు సభ్యుల నియామకంపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బోర్డు మెంబర్లుగా నియమించడం విమర్శలకు తావిస్తోంది.
నేరచరిత్ర వున్నవాళ్లు: వైసీపీ ప్రభుత్వం హిందూ మతాన్ని కించపరిచే చర్యలు చేపడుతోందని ఇప్పటికే భక్తులు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా తితిదే ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు మహామహులు పోటీ పడుతుంటే.. క్రైస్తవ మతాన్ని పాటించే వ్యక్తికి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తితిదే ఛైర్మన్ (TTD Chairman) పదవిని కట్టబెట్టారని ఆరోపించాయి. ఆ గొడవలు సద్దుమణుగుతున్నాయనుకునే లోపే మళ్లీ ధర్మకర్తల మండలి నియామకంపై విమర్శలు మెుదలయ్యాయి. తితిదే బోర్డు మెంబర్లలో నేరచరిత్ర వున్నవాళ్లు ఉండటంతో హిందూ సంఘాలు, వేంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.