GAS PIPELINE BLAST : అది రాత్రి సుమారు 10 గంటలు. పనులకు వెళ్లి వచ్చిన కూలీలు, ఉద్యోగానికి వెళ్లిన వారు అన్ని పనులు ముగించుకుని ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయం. అప్పుడే ఓ పేలుడు సంభవించింది. దీంతో ఉలిక్కిపడిన ప్రజలు ఆందోళన చెందారు. ఏమి జరిగిందో తెలుసుకుని భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతకీ మీకు చెప్పలేదు కదూ ఏమైందో. ఇంటింటికి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతున్న గ్యాస్ పైప్లైన్ బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామికవాడలో గ్యాస్ పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అధికారులు కొందరు దానిని పరిశీలించి వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి భయంతో పరుగులు తీశారు. గ్యాస్పైప్ లైన్లు పేలడంతో 30 అడుగుల మేర రాళ్లు, మట్టి పైకి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేసేందుకు యత్నిస్తున్నారు.