Sugar Farmers Protest: మూతపడిన సహకార చక్కర పరిశ్రమలను మనుగడలోకి తేవడం ద్వారా.. చెరకు రైతులను ఆదుకుంటామని పాదయాత్రలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ హామీని గాలికొదిలేశారు. మూతపడిన సహకార చక్కర పరిశ్రమలను విక్రయించడానికి లిక్విడేటర్‌ను నియమించారు.
తిరుపతి సమీపంలోని గాజులమండ్యంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌గా మారుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. చక్కెర పరిశ్రమ నిర్వహణకు సరిపడా చెరకు పంట లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరిశ్రమ విక్రయానికి వీలుగా లిక్విడేటర్‌నూ నియమించింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆందోళనలు చేపట్టారు. లిక్విడేటర్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రైతుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ చర్యలపై స్టే విధించింది.
శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ప్రకటించిన జగన్ .. వెయ్యి కోట్ల రూపాయల విలువైన పరిశ్రమ ఆస్థులపై కన్నేసి విక్రయించడానికి చర్యలు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. సహకార చక్కర పరిశ్రమలో భాగస్వాములైన తమ అనుమతి లేకుండా విక్రయ ప్రయత్నాలు ప్రారంభించారని రైతులు మండిపడ్డారు. పరిశ్రమను విక్రయించాలన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు.