Farmers Are Demanding Justice: ఆర్భాటపు ప్రకటనలు తప్ప... పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. అనేక సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయించినా... ముందడుగు పడటం లేదు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఒప్పందాలు కుదిరినా.. పరిశ్రమల ఏర్పాటు ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పారిశ్రామికవేత్తలు, భూములిచ్చిన రైతులకూ తిప్పలు తప్పట్లేదు.
Farmers_Are_Demanding_Justice తిరుపతి జిల్లా పరిధిలో 7 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా... దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో...జిందాల్ సంస్థ ఉక్కు పరిశ్రమఏర్పాటుకు ముందుకొచ్చింది. గూడూరు డివిజన్ పరిధిలో జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ సంస్ఢ- జేఎస్ఏఎల్ కు 840 ఎకరాలు కేటాయించారు. మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ సహకారం లేకపోవడంతో... పరిశ్రమ ఏర్పాటు ముందుకు సాగడం లేదు. అదనంగా మరింత విస్తీర్ణంలో భూములు కేటాయించాలన్న జిందాల్ సంస్థ విజ్ఞాపనలు అటకెక్కాయి.
గూడూరు నియోజకవర్గ పరిధి చిల్లకూరు, కోట, గూడూరు మండల పరిసర ప్రాంతాల్లో... కృష్ణపట్నం ఓడరేవుకు అనుసంధానంగా ప్రభుత్వం 2006 నుంచి వేల ఎకరాల భూమి సేకరించింది. పరిశ్రమలఏర్పాటులో భాగంగా కిన్నెటా పవర్ సంస్థకు కొంత భూమి కేటాయించింది. దాదాపు 15 ఏళ్లైనా అక్కడ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కిన్నెటా పవర్ సంస్థకు కేటాయించిన భూముల్ని జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్ కొనుగోలు చేయగా... 2021లో భూయాజమాన్య హక్కులను మార్పిడి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జిందాల్ స్టీల్ పరిశ్రమకు యాజమాన్య హక్కులు మార్పిడి చేసిన ప్రభుత్వం... రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు. ఏళ్ల తరబడి పరిహారం అందక.. ఉపాధి కోల్పోయి.... రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
'భూములు తీసుకునే సమయంలో... రెండు సంవత్సరాల్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి భూములు తీసుకున్నారు. అయితే గత పది, పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకూ స్పందించని వారు ఇప్పుడు.. అందరిని ఊరు నుంచి వెళ్లమంటున్నారు. మేము తరతరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. అలాంటిది ఇప్పుడు ఉన్నపళంగా మమ్మల్ని ఖాళీ చేసేది లేదు. మా భూముల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాం'-నిర్వాసిత రైతులు, గ్రామస్థులు
2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో... జేఎస్ఏఎల్, నల్వా స్టీల్స్ సంస్థలు సంయుక్తంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జేఎస్ఏఎల్. సంస్థ 3 వేల ఎకకరాల భూమి కేటాయించాలని కోరినా... కిన్నెటా సంస్థ నుంచి కొనుగోలు చేసిన 840 ఎకరాల భూమి యాజమాన్య హక్కుల మార్పిడి మినహా.... ప్రభుత్వం అదనంగా ఏమీ ఇవ్వలేదు. పరిశ్రమల ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. భూములిచ్చిన రైతులను ఊరు ఖాళీ చేయమని సంస్థ ఒత్తిడి తెస్తుండటంతో.. వారు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించేవరకు... పరిశ్రమల ఏర్పాటు జరగనివ్వబోమని భూములిచ్చిన రైతులు తేల్చిచెబుతున్నారు.