Devotees protest appointment of TTD Chairman: తిరుమల తిరుపతి పేరు చెప్పగానే.. ఆ దేవదేవుడిపై భక్తుల్లో విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. అయితే, గత కొన్ని రోజులుగా తిరుమలలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే భక్తులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి. ఇప్పటికే అన్యమత ప్రచారం అంటూ తిరుపతిలో ఇతర మతస్తులకు ఉద్యోగాలు, వసతులు కల్పిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈ సారి మాత్రం ఏకంగా ఎంతో తిరుమల దేవస్థానంలో ఎంతో పవిత్రమైన హోదాగా భావించే తితిదే (Tirumala Tirupati Devasthanam) ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమలలో ఓ బాలికను చిరుత హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా మరో మారు తితిదే ఛైర్మన్‌పై ఆరోపణలతో తిరుమల పవిత్రతపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ధార్మిక సంఘాలు, భక్తులు తిరుమల ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డినియామకంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి (Srinivasananda Saraswati) అన్యమతస్ధులను తితిదే ఛైర్మన్ గా నియమించారని ఆరోపిస్తూ ఏపీ సాధుపరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వద్ద సేవ్ తిరుమల - సేవ్ తితిదే అంటూ ధర్నా నిర్వహించారు. భక్తితో, విశ్వాసంతో ఉన్న హిందువులను తితిదే ఛైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయంలో ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు. తితిదే ధార్మిక సంస్ధ తితిదేను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం భక్తులకు చేతి కర్రలు ఇస్తామనడం సరైంది కాదన్నారు. తిరుమల చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు జరగలేదని... భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.