TTD Kalyanamastu Program: నిరుపేద కుటుంబాలకు.. తన పిల్లల పెళ్లి.. ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంతో తిరుమల తిరుమతి దేవస్థానం చేపట్టిన ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమం కల్యాణమస్తు అటకెక్కింది. తితిదే రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో విరమించుకుంది. ఆ తర్వాత దాని ఊసే మరచింది. నిరుపేదలకు, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న తితిదే కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కల్యాణమస్తులో పెళ్లి చేసుకుంటే తమ దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని.. కలలుకన్న అనేకమంది జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తీరు నిరాశ కలిగిస్తోంది. నిరుపేద వధూవరులకు బంగారు తాళిబొట్టు ఇచ్చి వివాహం జరిపించేందుకు కల్యాణమస్తు కార్యక్రమాన్ని 2007 సంవత్సరంలో తితిదే ప్రారంభించింది. ఆ తర్వాత ఈ వివాహ ఉత్సవ కార్యక్రమాన్ని ఆరుసార్లు నిర్వహించి తర్వాత దాన్ని పక్కన పెట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక తితిదే ధర్మకర్తల మండలిలో చర్చించి కల్యాణమస్తును పునరుద్ధరించాలని నిర్ణయించారు.
దీనికి అనుగుణంగా ఒక గ్రాము బంగారు మంగళ సూత్రంతో పాటు వెండి మెట్టెలు, వధూవరులతోపాటు వచ్చే 20 మందికి భోజనాలు, ఇతర ఖర్చులన్నీ కలిపి జంటకు 32వేల 232 రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని 2020 నవంబరులో ధర్మకర్తల మండలిలో తీర్మానించారు. దీనిపై 2021 ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో చర్చించి ఒక్కో జంటకు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలు అందించేందుకు తితిదే వద్దనున్న 20వేల మంగళసూత్రాలను వినియోగించుకునేందుకు ఆమోదించారు. గత ఏడాది ఆగస్టు ఏడో తేదీన కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు జరపాలని.. ముహూర్త పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు.