ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 11, 2022, 8:30 PM IST

ETV Bharat / state

తపాను బీభత్సం.. నీట మునిగిన పంటలు

Heavy damage in Andhra Pradesh due to Cyclone Mandaus: మాండౌస్‌ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వానల జోరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలాచోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

మాండౌస్‌ తుపాను
Cyclone Mandaus

రాష్ట్రంపై మాండౌస్‌ తుపాను తీవ్ర ప్రభావం

Cyclone Mandous effect in AP: మాండౌస్ తుపాను ధాటికి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కుండపోత వర్షం కురిసింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాయుడుపేటలో వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. చాలా చోట్ల పంటలు నీటిలో తడిసి పాచిపోతున్నాయి. అరటి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. పెళ్లకూరు మండలం చావలి, పెన్నేపల్లి, తాళ్వాయిపాడులో వాగులు పొంగాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు వర్షానికి తడిసి పాడయ్యాయి. నంద్యాల జిల్లాలో వరి రైతులు ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది.

నెల్లూరు జిల్లా: భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు... పెన్నా నదికి 30 వేల క్యూసెక్కులు నీరు వదిలారు. కలెక్టర్ చక్రధర్ బాబు పరిస్థితిని పర్యవేక్షించారు. మర్రిపాడు మండలంలో వర్షాల దాటికి నందవరం చెరువుకు గండిపడింది. పొట్టేపాలెం చెరువు కలుజు ఉద్ధృతి పెరిగింది. రాకపోకలు సాగించే అప్రోచ్ రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. 16 మండలాల పరిధిలోని 118 గ్రామాల్లో వరి, పత్తి, అపరాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా వేశారు. నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తల్పగిరి కాలనీ, శ్రామిక నగర్, ఆర్టీసీ కాలనీ, తిరుపతి నగర్, ఎన్జీవోఎస్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాను వర్షాలు వణికించింది. 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్షాలకు రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని గుంజినేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వానలకు తోడైన గాలుల దెబ్బకు... ఓబులవారిపల్లి మండలం బొమ్మవరంలో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. బొప్పాయి మొలకలు నీళ్లలో పాచిపోతున్నాయి. మామిడి, అరటి తోటలను అధికారులు పరిశీలించారు.

ప్రకాశం జిల్లా: మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇళ్లలోకి నీరు చేరి జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గొబ్బూరు, తోకపల్లి, కొత్తపల్లి, దేవరాజుగట్టు గ్రామాల్లో మిర్చి పంట దెబ్బతింది. దర్శి మండలంలో కొత్తపల్లి చెరువు అలుగు పొంగింది. తూర్పు వెంకటాపురం వద్ద వాగులో కారు ఆగిపోగా... స్థానికులు అతికష్టమ్మీద బయటికి తీశారు. ముండ్లమూరు వద్ద చికలేరు వాగు, దర్శి వద్ద దోర్నపు వాగు పొంగిపొర్లుతున్నాయి. రాజంపల్లి, కొత్తపల్లి, తాళ్లురు, నాగంబొట్లపాలెం, రాజానగరంలో వరి పంట నేలకొరిగింది.

కృష్ణా జిల్లా: పామర్రు నియోజకవర్గంలో మాండౌస్ తుఫాను ప్రభావంతో పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షం కురవడంతో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపరిహార అంచనాలకు 24 గంటల్లోగా అధికారులు పంపించి అంచనా వేయించాలని తెలిపారు. లేని పక్షంలో ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతామని తెదేపా పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్‌ వర్ల కుమార్ రాజా హెచ్చరించారు.

గుంటూరు జిల్లా: దుగ్గిరాల మండల రైతులను వాన కోలుకోలేని దెబ్బతీసింది. కోతకు వచ్చిన వరి భారీ వర్షాలకు నేలకొరిగింది. పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. తడిసిన వడ్లు మొలకలు రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే నిండా మునిగిపోతామని వాపోతున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లిలో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. భారీ వర్షాలకు సుమారు 10 వేల ఎకరాల్లో ధాన్యం తడిసిందని అంచనా. కొన్నిచోట్ల రోడ్లపై ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. కోనసీమ జిల్లాలో ఆరబోసిన ధాన్యాన్ని తరలించేందుకు బస్తాలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు.

వైఎస్ఆర్ కడప జిల్లా: తుపాను ప్రభావిత రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ... కడప కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. వెంటనే బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details