AP Crime News: తిరుమలలో వరుస రోడ్డు ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 4 ప్రమాదాలు జరగటం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. తమిళనాడు భక్తులు శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా.. మొదటి ఘాట్ రోడ్డులోని నాలుగో మలుపు వద్ద వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ వాహనంలో 12 మంది ప్రయాణిస్తుండగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో ముంబయికి చెందిన భక్తుల టెంపో వాహనానికి బ్రేకులు పనిచేయక.. డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. మూడో ప్రమాదంలో మొదటి ఘాట్ రోడ్డులో 15వ మలుపు వద్ద బెంగుళూరుకు చెందిన భక్తుల కారు బ్రేకులు వైఫల్యంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అలాగే మాల్వడి గుండం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.ఈ రెండు ప్రమాదాలలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన బస్సు: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద.. పర్యాటకుల కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు.. విశాఖ ఆస్పత్రికి తరలించారు. విశాఖకు చెందిన పర్యాటకులు.. ఆదివారం కావడంతో పర్యాటక కేంద్రం మధ్య గుండాన్ని సందర్శించి.. తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకంది. ఘాట్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో.. పల్టీలు కొడుతూ లోయలోకి దూసుకెళ్లింది.