CHANDRABABU FIRES ON CM JAGAN : ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైకాపా పిశాచాలు పడ్డాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైసీపీ నేతలు సమాధులను తవ్వేసి స్మశానాన్ని కబ్జా చేస్తే.. అధికారులంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. వ్యవస్థలు సమాధి అయిన చోట వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఉన్నతాధికారులైనా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. "ఇదేం ఖర్మ" మన రాష్ట్రానికి అని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రివర్స్ రెడ్డి: మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు.. చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా అని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రివర్స్ పాలన అంటే ఇదేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. రివర్స్ రెడ్డిలా మారరని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులు పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశామన్న చంద్రబాబు.. సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను.. అందునా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా నర్సాపురం ప్రాంతీయ ఆస్పత్రి ముందు ఉన్న చెట్లను నరికివేయడం పై స్పందించిన చంద్రబాబు.. 'ఇదేమి ఖర్మ- రాష్ట్రానికి' అంటూ ఆక్షేపించారు.
సీమద్రోహులు ఎవరూ: పాలకులు రాక్షసులైతే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే ఉదాహరణ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాయలసీమలో నాడు మేము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయని ప్రశ్నించారు. పెట్టుబడులను తరిమేసింది ఎవరు? సీమ ద్రోహులు ఎవరు? సీమకు పరిశ్రమలు తెచ్చిన మేమా.. లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్లగొట్టిన మీరా? అని నిలదీశారు.