Bhoomi Pooja for TTD Temple in Navi Mumbai: మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రేమండ్స్ కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా, టీటీడీ ట్రస్ట్ బోర్టు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో నవీ ముంబయిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు తితిదే ముందుకు రావటాన్ని అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల వెళ్లి దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయంలో స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. నవీ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ముంబయిలో శ్రీవారి ఆలయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు రేమండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు. రూ. 70 కోట్ల వ్యయంతో రెండేళ్లలో తిరుమల తరహాలోనే నవీ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని టీడీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయానికి భూమిని కేటాయించి, నిర్మాణానికి తోడ్పడుతున్న మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం, రేమండ్స్ కంపెనీ అధినేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రేలకు.. టీడీడీ ఛైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.