Arguments held in High Court on TTD funds utilization:తిరుపతిలో వివిధ పనులకు తాము నిధులు ఖర్చుచేయడం ఇది మొదటిసారి కాదని టీటీడీ కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి హైకోర్టులో కౌంటర్ వేశారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఏళ్లుగా తిరుపతిలో పారిశుద్ధ్యం, తదితర పనులకు టీటీడీ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే టీటీడీ ఆలయాలు, బస్సు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, తదితర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. తిరుపతి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, సురక్షిత తాగునీటి సరఫరాకు టీటీడీ నిధులను గతంలో ఖర్చుచేశామన్నారు. ప్రస్తుత పిల్‌లో ప్రజాహితం లేదన్నారు. పిటిషనర్‌కు జరిమానా విధిస్తూ పిల్‌ను కొట్టేయాలని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం. ఈవో వేసిన కౌంటర్‌కు తిరుగు సమాధానంగా కౌంటర్ వేసేందుకు పిటిషనర్‌కు సమయం ఇచ్చింది. విచారణను 2024 జనవరి 10కి వాయిదా వేసింది.
TTD Trust Board Meeting Decisions : తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు.. ధర్మకర్తల మండలి నిర్ణయం
గతంలోనూ వివిధ పనులకు నిధులు ఖర్చు: తిరుపతి పట్టణ పరిధిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, భక్తుల వసతి గదులు, పరిసరాలలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం రూ.52 కోట్లు ఖర్చుచేయనున్నామన్నారు. గతంలోనూ వివిధ పనులకు నిధులు ఖర్చుచేశామని తెలిపారు. పిటిషనర్ బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు టీటీడీ నిధులను అభివృద్ధి పనులకు ఖర్చుచేశారన్నారు. అప్పుడు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పారిశుద్ధ్యం పనుల కోసం తిరుపతి కార్పొరేషన్‌కు టీటీడీ నేరుగా సొమ్ము చెల్లించడం లేదన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పారిశుద్ధ్య పనులపై ప్రభావం చూపుతుందన్నారు. వాటిని ఎత్తివేయాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపిస్తూ, రిప్లై కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు.