CPI National Secretary Narayana Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతి నగర శివార్లలోని శెట్టిపల్లి భూములను సందర్శించిన ఆయన.. శెట్టిపల్లి భూముల వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శెట్టిపల్లి భూములలో ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన బాధితుల, రైతులకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పంచాలి: ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా మాట్లాడుతూ..''తిరుపతి నగర శివార్లలో ఉన్న శెట్టిపల్లి భూములను ఆనాడు ప్రజలు తక్కువ ధరకు రావడంతో సెంటు, రెండు సెంట్లు, మూడు సెంట్లు అలా కొనుక్కున్నారు. ఆ తర్వాత ఇళ్లను కట్టుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వచ్చి ల్యాండ్ పోలింగ్ పెడతామని, 500 ఎకరాలను తీసుకుంటామని, మీకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి.. ఈ స్థలంలో మీటింగ్ పెట్టి.. చంద్రబాబు చెప్పిందంతా అబద్ధం తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములను మీకే ఇచ్చేస్తామంటూ హామీలు ఇచ్చారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవువుతుంది. ఇప్పటిదాకా ఈ భూములవైపే తిరిగి చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకుని.. ఈ స్థలంలో ప్రజలు ఇళ్లు కట్టుకున్న తర్వాత రోడ్లు, నీళ్లు, విద్యుత్ సదుపాయాలను కల్పించాలి. వాటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు చూయించి అందులో సగం ప్రభుత్వం, మరికొంత సగం భూమిని కొన్న వారి వద్ద వసూలు చేసి, వారికి కనీస మౌలిక సదుపాయాలను కల్పించండి.'' అని ఆయన అన్నారు.
శెట్టిపల్లి భూముల వివాదాన్ని పరిష్కరించాలి: అనంతరం గ్రామీణ, నగర వైసీపీ నాయకుల మధ్య వాటాలు పంచుకోవడంలో తేడాలు రావడంతో శెట్టిపల్లి భూముల అంశాన్ని మరింత వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన భూసేకరణను తప్పు బట్టిన జగన్.. నాలుగేళ్ళు గడుస్తున్నా ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. శెట్టిపల్లి భూములను తిరుపతి నగరపాలక సంస్ధలోకి విలీనం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుమానస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.