Althurupadu Lift Scheme Works : తిరుపతి జిల్లా ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడం ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. దాహార్తితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాగునీరు అందిస్తాం అంటూ.. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఆ ప్రాంత ప్రజలు పులకించిపోయారు. తమ సాగు నీటి కష్టాలు తీరి.. ఏటా రెండు పంటలు పండించుకోవచ్చని కలలు కన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణాల వేగం పెరగకపోగా మందగించాయి.
కొంతకాలం పాటు నత్తనడకన సాగిన పనులు పూర్తిగా ఆగిపోయాయి. తెలుగు గంగ కాలువ వద్ద లిఫ్ట్ పనులు చేపట్టిన గుత్తేదారుకు 22 కోట్ల రూపాయల మేర ప్రభుత్వం బకాయి పడింది. నిధులు చెల్లిస్తే తప్ప పనులు చేయలేమని గుత్తేదారు పనులు ఆపేశారు. మరో వైపు ఆల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి మట్టి సమస్య ఏర్పడింది. ఎంపిక చేసిన ప్రాంతం నుంచి మట్టి తరలించేందుకు మామూళ్లు ఇస్తే తప్ప అంగీకరించబోమని అధికార పార్టీ నేతలు అంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక స్థానిక నేతల చేతులు తడపలేక గుత్తేదారు పనులు ఆపేయడంతో ఆల్తూరుపాడు చెరువుకట్ట, తెలుగుగంగ కాలువ సమీపంలో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి.
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మల్లెమడుగు, బాలాజీ జలాశయాలకు నీటిని తరలించడంలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఆల్తూరుపాడు జలాశయం విస్తరణ తెలుగుగంగ కాలువ 34 కిలోమీటర్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఆల్తూరుపాడు నుంచి మేర్లపాక, అక్కడి నుంచి మల్లెమడుగు జలాశయానికి నీటిని తరలించేందుకు 116 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. 48 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు.
185 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆల్తూరుపాడు జలాశయ నిర్మాణ పనులకు దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గుత్తేదార్లకు నిధులు విడదల చేయకపోవడంతో పాటు ఇతర అంశాల్లో సహకారం కొరవడటంతో నిర్మాణాలు ఆగిపోయాయి. తిరుపతి, తిరుమలతోపాటు మూడు నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించే ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మూడేళ్లుగా ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం పనులు పూర్తికాకపోవటంతో తమ భూములు బీడుబారి పోయాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగు నీరందించాలని రైతులు కోరుతున్నారు.
అటకెక్కిన ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం!