Gangamma Jathara: పాలెగాళ్ల అరాచకాలను అంతమొందిచేందుకు ఉద్భవించిన దేవతగా.. కలియుగ దైవం తిరుమల శ్రీవారి సహోదరిగా పూజలందుకుంటున్న తిరుపతి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. తిరుపతి నగరంలోని తాతయ్యగుంటలో వెలసిన గంగమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడు కొండల వెంకన్నకు ఆడపడుచుగా భావిస్తూ గంగమ్మకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తారు. మంగళవారం విశ్వరూప స్తూపానికి అభిషేకాలు నిర్వహించి.. వడిబాలు కట్టడంతో.. జాతరకు అంకురార్పణ జరిగింది. అవిలాల నుంచి పసుపు కుంకుమలతో సారె తీసుకొచ్చి.. చాటింపు వేయడంతో.. జాతర ప్రారంభమైంది.
స్థల పురాణం:తిరుపతి గంగమ్మ జాతరకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావటానికి ప్రధాన కారణం జాతరలో భక్తులు ప్రదర్శించే వేషధారణలు. పూర్వం చిత్తూరు జిల్లా ప్రాంతంలో పాలెగాళ్ల అరాచకాలు ఎక్కువగా ఉండేవని.. నానాటికీ దురాగతాలు ఎక్కువ అవటంతో అమ్మవారు గంగమ్మ తల్లిగా ఉద్భవించిందని స్థల పురాణం. అమ్మవారికి భయపడిన అప్పటి పాలెగాడు గంగమ్మకు కనపడకుండా దాక్కొని జీవించేవాడట. పాలెగాడిని బయటకి రప్పించేందుకు గంగమ్మ తల్లి రోజుకో వేషంతో బూతులు తిడుతూ సంచరించేదని ఆలయ ప్రశస్తి. చివరికి దొరవేషములో పాలెగాడిని సంహరించి భక్తుల కష్టాలను తీర్చిందని నమ్మకం. నాటి నుంచి అమ్మవారికి ఏటా చైత్రమాసం చివరి వారంలో 7 రోజుల పాటు భక్తులు రోజుకో వేషంతో గంగమ్మకు వైభవోపేతంగా జాతర నిర్వహిస్తారు.