Nara Lokesh Yuvagalam : యువగళం దెబ్బతో ఇన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన సీఎం జగన్.. ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాయలసీమ బిడ్డనంటూ ఎన్నికల ముందు మభ్యపెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీమను నాశనం చేశారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో ప్రమేయం లేదని సీఎం జగన్.. శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయగలరా అని లోకేశ్ సవాల్ విసిరారు.
తిరుపతి జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 29వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలోని శివగిరి నుంచి పాదయాత్ర లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ యువనేత ముందుకు సాగారు. అనంతరం లోకేశ్ తొండవాడ సభలో పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఈ సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నలుగురు నేతలు శ్రీవారి టిక్కెట్లు, భూములు కొల్లగొడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. ఇసుక, మద్యం అక్రమాలతో కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. జగన్ సీఎం అయిన తర్వాత వెంకటేశ్వరస్వామిని పేదవారికి దూరం చేశారని అన్నారు. ఈ నాలుగేళ్లలో జగన్ రాయలసీమకు చేసిన మేలు ఏమిటో.. సీమవాసులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు.