YSRCP Government Cheated the Residents of Mulapeta Port : శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల్ని ప్రభుత్వం నిలువునా వంచించింది. పోర్టు నిర్మాణానికి భూములిస్తే కోరినంత పరిహారం అంటూ గ్రామ సభల్లో ప్రభుత్వాధికారులతో కలిసి మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు అరచేతిలో స్వర్గం చూపించారు.
Governmentnot Giving Compensation to Mulapeta Farmers : శ్రీకాకుళం కలెక్టర్, మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనేక హామీలు ఇచ్చారు. భూములు ఇచ్చేంత వరకూ వెంటపడి.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారంటూ ఇటీవలే మూలపేట రైతులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను నిలదీశారు. ఆయన మాత్రం తానెలాంటి హామీ ఇవ్వలేదంటూ బుకాయించారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో ఒక్కో జీడి మామిడి చెట్టుకు 5 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని నమ్మబలికి.. చివరకి 2వేల 500 మాత్రమే ఇచ్చారు. అది కూడా అన్ని చెట్లకు కాకుండా కొందరు రైతులకే చెల్లించారు.
Mulapeta Farmers Fire on MLC Duvwada Srinivasa Rao :ఇక తాత్కాలికంగా వలస వెళ్లిన వారినీ నిర్వాసితులుగా గుర్తిస్తామని వైసీపీ ప్రజాప్రతినిధులు అప్పట్లో హామీ ఇచ్చారు. ఐతే తాత్కాలికంగా వలస వెళ్లిన వారిలో కేవలం 36 మందినే నిర్వాసితుల జాబితాలో చేర్చారు. వారికీ ఇంకా పరిహారం అందించలేదు. కటాఫ్ తేదీ నాటికి 18 ఏళ్లకు ఒకటి, రెండు నెలలు తక్కువ వయసు ఉన్నప్పటికీ వారినీ నిర్వాసిత కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ ఇస్తామని నమ్మబలికారు. నైపుణ్యం ఉన్న యువకులకు పోర్టులో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు చెప్పిన వారికి తప్ప నిజంగా భూములు త్యాగం చేసిన వారికి న్యాయం జరగడం లేదని అంటున్నారు.