ఇతర రాష్ట్రంలో జరిగిన సంఘటనను ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు చిత్రీకరిస్తూ ఫేస్బుక్లో తప్పుడు ప్రచారం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కవిటి మండలం సవసాన పుట్టుక కు చెందిన ఈగల సంతోష్ అనే యువకుడు అంతర్జాలంలో తప్పుడు ప్రచారం చేస్తూ సైబర్ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.
ఇంతకీ అతనేం చేశాడంటే...
ఓ వ్యక్తి తన భార్య కరోనా వైరస్ వల్ల మృతిచెందగా.. ఆ మృతదేహాన్ని సైకిల్ పై తీసుకెళ్తున్నట్లు ఉన్న చిత్రానికి అభ్యంతరకరమైన సందేశాన్ని జోడించి సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇది సైబర్ నిబంధనలను అతిక్రమించడమేనని ఉన్నతాధికారులు భావించారు. వారు ఇచ్చిన ఆదేశాలమేరకు యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇటువంచి చర్యలకు పాల్పడనని సంతోష్ వ్యక్తిగత హామీ ఇచ్చిన అనంతరం స్టేషన్ బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.